హుస్నాబాద్, 2026-11-24
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ మంగళవారం జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ గారు మంగళవారం జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పనితీరును, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ గారు పోలీస్ స్టేషన్ ఆవరణ, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
స్టేషన్ పరిధిలోని సీజ్ చేసిన వాహనాలు, ఇతర క్రైమ్ ప్రాపర్టీని పరిశీలించి, వాటి భద్రత మరియు రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 112కు ఫోన్ కాల్ రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు.
ప్రజలు సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని తెలిపారు. నేరాల నియంత్రణ మరియు గ్రామాల భద్రత కోసం సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు.
జగదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వద్ద నిర్వహిస్తున్న రాముడు బండ జాతరను సీపీ గారు సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును క్షుణ్ణంగా పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ గ్రామీణ సీఐ రవి రాజు, ఎస్ఐ కృష్ణ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.







