తరిగొప్పుల, 2026-11-23
తలకొరివికి ముందుకురాని కన్నబిడ్డలు.. పంచాయతీ సిబ్బంది, గ్రామస్థుల మానవత్వంతో అంతిమ సంస్కారాలు
తరిగొప్పుల: కన్నతల్లి చివరి మజిలీలో కన్నబిడ్డలు అండగా నిలవకపోవడం కలచివేస్తే.. గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది మానవత్వంతో ముందుకొచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించడం అందరినీ కదిలించింది. కీర్తిశేషులు నాగబండి రామచంద్రం భార్య పుష్పనీలకు ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలకు వారిలో ఇద్దరు కుమార్తెలు మాత్రమే హాజరయ్యారు. తలకొరివి పెట్టాలని గ్రామస్థులు కోరగా, తాము పెట్టబోమని వారు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామపంచాయతీ సిబ్బంది తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
నాగబండి కుటుంబానికి చెందిన వైశ్య కులస్తులు, గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పాడెను మోశారు. సుమారు 40 మంది అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. కన్నబిడ్డలు ఉన్నా చివరి సంస్కారాలకు ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో గ్రామమే కుటుంబంగా మారి అండగా నిలిచింది. బంధుత్వం కన్నా మానవత్వం గొప్పదని చాటిన ఈ ఘటన తరిగొప్పులలో చర్చనీయాంశమైంది.







