రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ చిట్యాల బాబు పిలుపునిచ్చారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
కోహెడ మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సోమవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని ఆరేపల్లి సర్పంచ్ చిట్యాల బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినా, మరణం సంభవించినా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జీవిత బీమా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన వివరాలు, ధ్రువపత్రాలను సమర్పించి బీమా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాలన్నీ ఈ పథకం పరిధిలోకి వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి ఎంతో మేలు చేస్తాయని, అర్హులెవరూ ఈ అవకాశాన్ని కోల్పోకూడదని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింగారావు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.







