నేలమట్టం (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడంలో కోహెడ గ్రామ పంచాయతీ పాలకవర్గం దూకుడు ప్రదర్శించింది. కూల్చివేతల చర్యలతో సుమారు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి కబ్జా చెర వీడింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సాగిన ఈ కూల్చివేతలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జాకోరల నుంచి రక్షించడంలో కోహెడ గ్రామ పంచాయతీ పాలకవర్గం దూకుడు ప్రదర్శించింది. కూల్చివేతల చర్యలతో సుమారు రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి కబ్జా చెర వీడింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సాగిన ఈ కూల్చివేతలపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల సమక్షంలో తొలి అడుగు
గ్రామంలోని బాడుగుల చెరువు కట్ట కింద సర్వే నంబర్ 1227లో 217 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 20 గుంటల స్థలం కబ్జాకు గురైనట్లు తహసీల్దార్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ స్థలంలో పొన్నాల భూపతి ఫంక్షన్ హాల్ ప్రహరీ, ఒకటో వార్డు సభ్యుడు కట్ట ప్రవీణ్ తొమ్మిది పిల్లర్లతో భవనం, పందుల షెడ్లు నిర్మించారు. వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ నెల 5న సర్పంచ్ సుజాత బాలకిషన్, వార్డు సభ్యులు ఎక్స్కవేటర్తో రంగంలోకి దిగారు. ఆక్రమణదారుల అడ్డుకునే ప్రయత్నం చేసినా రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో కట్టడాలను తొలగింపజేశారు.
బస్టాండ్ వద్ద అక్రమ షెడ్లు నేలమట్టం
మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో మర్రి చెట్టు వద్ద ఉన్న సర్వే నంబర్ 1229లోని కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఏళ్లుగా కబ్జా చేసి రేకుల షెడ్లు వేశారు. ఇందులో ఇద్దరు జీవో 50 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోగా, మరికొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే ఆక్రమణలకు పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో రహదారిని సైతం ఆక్రమించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అధికారుల అండతో సర్పంచ్ సుజాత, ఉపసర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యులు ఈ నెల 16న స్వయంగా నిలబడి అక్రమ షెడ్లను తొలగింపజేశారు. ఇందులో ఇద్దరు వార్డు సభ్యులకు చెందిన ఆక్రమణలను సైతం తొలగించడం గమనార్హం. త్వరలోనే సర్వే నంబర్ 548తో పాటు ఇతర ప్రభుత్వ భూములను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో సర్వే చేయించి కబ్జాలను తొలగించేందుకు పాలకవర్గం సిద్ధమవుతోంది.


