మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద 2021-2022 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై తరిగొప్పుల మండలం అంకుషాపూర్ గ్రామంలో ఐదో రౌండ్ సామాజిక తనిఖీ గ్రామసభను శనివారం నిర్వహించారు. ఈ సభలో పనుల అమలు, కూలీలకు కల్పించిన ఉపాధి, అభివృద్ధి పనుల వివరాలను ప్రజల సమక్షంలో పరిశీలించారు.
గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలోని కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించడంతోపాటు, గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సామాజిక తనిఖీల ద్వారా పనులకు సంబంధించిన వివరాలను ప్రజల సమక్షంలో పరిశీలించడం వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి, అర్హులైన కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు. గ్రామసభలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులు, కూలీల హాజరు, పనుల అమలు తీరు తదితర అంశాలను అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు, ఉపాధి హామీ కూలీలు తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అధికారులు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, గ్రామ పాలకవర్గ సభ్యులు నాగపురి ఝాన్సీ గౌడ్, మాదాసు పద్మ, అబ్బి బిక్షపతి, నాగపురి రాజేష్, జాంజల సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రసాద్, గ్రామస్థులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.












