సిద్ధిపేట (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 21
చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు బానిసైతే భవిష్యత్తు అంధకారమవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని న్యాయవాదులు విద్యార్థులకు సూచించారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తును మత్తు పదార్థాలు ఛిద్రం చేస్తాయని, చిన్న వయసులోనే చెడు వ్యసనాలకు బానిసైతే జీవితం అంధకారంలో పడుతుందని న్యాయవాదులు ఎస్. రాజేశ్, బి. రమేశ్ హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, సిద్ధిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి. సుదర్శన్ ఆదేశాల మేరకు బుధవారం నంగునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొట్టిపర్తి రామస్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, బాలల హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్నారు. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు క్రమంగా వ్యసనంగా మారి విద్య, ఆరోగ్యం, కుటుంబ జీవనాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. మత్తు పదార్థాల విక్రయం, వినియోగం, అక్రమ రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి వ్యవహారాలు తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
బాలల హక్కులపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని, బాలలపై జరిగే వేధింపులు, అన్యాయాలను మౌనంగా భరించకూడదని తెలిపారు. సమస్యలు ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులు పంపే సందేశాలు, అనుమానాస్పద లింకులను తెరవకూడదని హెచ్చరించారు. వ్యక్తిగత వివరాలు, రహస్య సంకేతాలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని, సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. చట్టాలపై అవగాహన హక్కులకు రక్షణ కల్పిస్తుందని, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టి, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు గొట్టిపర్తి రామస్వామిగౌడ్, ఉపాధ్యాయులు దుబ్బుడు రవీందర్‌రెడ్డి, కొత్తపల్లి రవి, కోర్టు సిబ్బంది ఆకుల శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.







