రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రజాపాలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని శనివారం నర్మెట్ట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్మెట్ట గ్రామ సర్పంచ్, జనగామ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ కార్యక్రమమని అన్నారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామంలోని అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పథకం ప్రయోజనాలు అందేలా గ్రామ పంచాయతీ తరఫున కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమన్, ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యలక్ష్మి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నసీరుద్దీన్, వార్డు సభ్యులు చెప్యాల మహిపాల్ రెడ్డి, కొలపాక యాదగిరి, నిమ్మకంటి బాపురాజు, కొన్న చంద్రయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.







