కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
సిద్దిపేట జిల్లా మండలం తంగలపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని పదవ తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. గణిత సబ్జెక్టులోని సమస్యలను విద్యార్థినులతో స్వయంగా పరిష్కరింపజేస్తూ వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థినుల చదువు, బోధన తీరుపై ఆరా తీశారు.
పాఠశాలలో వాష్రూమ్ సమస్య ఉందని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థినులు నీటి సమస్యను తన దృష్టికి తీసుకురాగా, ఆ సమస్యను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా విద్యార్థినులు గుర్తుచేశారు.
అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై మంత్రి ఆరా తీశారు. విద్యార్థినులకు ఎల్లప్పుడూ నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
పదవ తరగతి విద్యార్థులకు ఇది భవిష్యత్తు జీవితానికి తొలి మెట్టు అని, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని బాగా చదువుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తంగలపల్లి కస్తూర్బా పాఠశాలను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలోని శంకుస్థాపన బోర్డును చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
విద్యార్థినులకు మెరుగైన విద్య, వసతులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.



