దోర్నకల్, 2026-11-26
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండాలో గ్రీన్ఫీల్డ్ హైవే బాధితులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. నాగ్పూర్-అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా తండాలో 30కి పైగా ఇళ్లు నేలమట్టం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం చెల్లించినప్పటికీ, ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు అధికారులను కోరుతున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు గ్రామ శివారులోని సర్వే నంబర్ 408లో ఉన్న సుమారు రెండు ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఆ భూమి తన పేరుపై అసైన్డ్ పట్టా ఉందని మంగ్య అనే రైతు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. దీంతో ఎమ్మార్వో రాఘవరెడ్డి బాధితులు, పట్టాదారుడితో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. భూ వివాదాన్ని అధికారులు ఎలా పరిష్కరిస్తారన్న దానిపై తండాలో ఉత్కంఠ నెలకొంది.







