ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో సుమారు రెండు దశాబ్దాలుగా తాత్కాలిక ఉద్యోగిగా సేవలందించిన నిరుపేద కుటుంబానికి చెందిన ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త మరణించడంతో భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆపదలో ఉన్న తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుడి భార్య అంజలి కన్నీటిపర్యంతమవుతూ ప్రభుత్వాన్ని, దేవాదాయ శాఖ అధికారులను వేడుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన దొమ్మాట సురేష్ (43), తండ్రి చంద్రయ్య, గత 20 సంవత్సరాలుగా శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ సేవలందించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ నెల 15 న ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మృతుడు సురేష్ కు భార్య అంజలి, చదువుకుంటున్న కుమారుడు చరణ్ , కుమార్తె సాహితి ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారం. నిరుపేద కుటుంబం కావడంతో భర్త వైద్య చికిత్స కోసం అప్పులు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగామని, అయినప్పటికీ ఆయనను కాపాడుకోలేకపోయానని భార్య అంజలి ఆవేదన వ్యక్తం చేశారు.
నా పిల్లల భవిష్యత్తును ఎవరు చూసుకుంటారు
తన భర్త మరణంతో కుటుంబ పోషణ, ఇద్దరు పిల్లల చదువులు, వారి భవిష్యత్తు భారమంతా తనపై పడిందని అంజలి కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటికే వైద్య చికిత్స కోసం చేసిన అప్పులతో ఆర్థికంగా చితికిపోయామని, ఇప్పుడు కుటుంబాన్ని ఎలా నడిపించాలో తెలియని దుస్థితిలో ఉన్నానని వాపోయారు.
సుమారు 20 సంవత్సరాల పాటు మల్లన్న ఆలయంలో సేవలందించిన తన భర్త కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆమె వేడుకున్నారు. సిద్దిపేట జిల్లా ఇంచార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ప్రత్యేక చొరవ తీసుకుని తమ కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.







