కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 20
కోహెడ మండలం కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు చేపట్టిన నిర్ధారణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం పరిధిలోని గ్రామాల దివ్యాంగులు, వయోవృద్ధులకు సహాయ సహకారాలు అందించాలనే సంకల్పంతో అలింకో ఆధ్వర్యంలో అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు చేపట్టిన నిర్ధారణ శిబిరాన్ని మండలంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
శిబిరంలో జరుగుతున్న నమోదు ప్రక్రియ, లబ్ధిదారుల వివరాల సేకరణ, అర్హుల గుర్తింపు తదితర అంశాలను ఆమె పరిశీలించారు. దివ్యాంగులు, వయోవృద్ధులకు అవసరమైన వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు, వాకింగ్ స్టిక్స్, ఇతర సహాయ ఉపకరణాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆత్మగౌరవంతో జీవనం
దివ్యాంగులు, వయోవృద్ధులు ఆత్మగౌరవంతో, స్వావలంబనతో జీవించేందుకు ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న వికలాంగులు, వయోవృద్ధులకు ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారద, డిసిపిఓ రాము, ఎంపీడీవో ఇతర శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయబడినది.


