సిద్దిపేట, 2026-11-26
100 శాతం దివ్యాంగత్వం ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కాకపోవడంతో ఒక బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
100 శాతం దివ్యాంగత్వం ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కాకపోవడంతో ఒక బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సదరం ధ్రువీకరణ పత్రం ఉన్నా పింఛన్ అందకపోవడం, మళ్లీ రెన్యూవల్ చేయించుకోవాలని అధికారులు సూచించడంతో కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బండి దశరథం కుమారుడు బండి దీక్షిత్ కుమార్ కు 2020లో వైద్య పరీక్షల అనంతరం 100 శాతం మానసిక దివ్యాంగత్వంతో యూడీఐడీ, సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కెమ్మసారం అశోక్ తెలిపారు. అయితే సదరం సర్టిఫికెట్ కు మూడేళ్ల కాలపరిమితి విధించడంతో రెన్యూవల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 100 శాతం దివ్యాంగత్వం ఉన్నట్లు ధ్రువీకరించినప్పుడు శాశ్వత సర్టిఫికెట్ ఎందుకు జారీ చేయలేదని అశోక్ ప్రశ్నించారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సర్టిఫికెట్ జారీ చేసినప్పటికీ కాలపరిమితి విధించడంపై ఉన్నతాధికారులు పరిశీలన జరపాలని ఆయన కోరారు.
కుమారుడికి పింఛన్ మంజూరు చేయించేందుకు తండ్రి బండి దశరథం పలువురు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, సమస్య పరిష్కారం కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని సంఘం నాయకులు తెలిపారు. ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ, డీపీఎం అధికారులు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బాధితుడికి న్యాయం చేయాలని అశోక్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగులు 20 నుంచి 30 మంది వరకు ఉండవచ్చని ఆయన తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ, రెన్యూవల్, పింఛన్ల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, బండి దీక్షిత్ కుమార్ కు పింఛన్ మంజూరయ్యే వరకు తమ సంఘం తరఫున పోరాటం కొనసాగిస్తామని కెమ్మసారం అశోక్ స్పష్టం చేశారు.







