మద్దూరు, 2026-11-26
సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించినట్లు సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం తెలిపారు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపులో మొదటి రోజే 152 మంది గ్రామస్తులు నమోదు చేసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ పథకం కింద ప్రతి కుటుంబంలో సంపాదించే ఒక్కరికి రూ. 5 లక్షల జీవిత బీమా ఉంటుంది. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రజలు ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేదు. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తీసుకొచ్చారని సర్పంచ్ తెలిపారు. మన సిద్దిపేట నుండే ఈ పథకం ప్రారంభం కావడం గర్వకారణమని ఆయన అన్నారు.
గాగిల్లాపూర్ లో ఒక్క కుటుంబం కూడా ఈ పథకం నుండి మినహాయింపు లేకుండా, మిగిలిన వారందరినీ కూడా త్వరలోనే నమోదు చేయిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ పథకానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబర్ అవసరమని, 18 నుండి 59 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు.
అనంతరం గ్రామ పంచాయతీలో డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం వల్లే ఈరోజు మనం సర్పంచ్‌గా, వార్డు సభ్యులుగా పని చేస్తున్నామని, రాజ్యాంగ స్ఫూర్తితోనే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ కనక చంద్రం పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మంజుల, కార్యదర్శి రజియా, ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







