ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు, మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన నీరజ్ శేఖర్‌కు ఈసారి పార్టీ టికెట్ నిరాకరించింది. న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆయన రాజ్యసభ ప్రయాణానికి ప్రస్తుతానికి ముగింపు పలికినట్లయింది.
ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభకు 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించగా ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గంగ్వార్‌లను బరిలోకి దించింది. ముఖ్యంగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరినీ తిరిగి ఎంపిక చేయకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
నీరజ్ శేఖర్ 2007లో తండ్రి చంద్రశేఖర్ మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ తరఫున బలియా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లోనూ అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2014లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపింది.
2019లో బలియా లోక్‌సభ టికెట్ విషయంలో సంతృప్తి లేకపోవడంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం బీజేపీ ఆయనను రాజ్యసభకు పంపింది. 2020లో మరోసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభించింది. ఆయన ప్రస్తుత పదవీకాలం తో ముగియనుంది.
ఇటీవల రాజ్యసభ టికెట్‌పై మాట్లాడిన నీరజ్ శేఖర్ బీజేపీలో నాయకుల చుట్టూ తిరిగితే టికెట్ రాదని, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయనకే టికెట్ దక్కకపోవడంతో ఆ వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ తాజా ఎంపికలు వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన వ్యూహాత్మక నిర్ణయాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












