సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ముప్పుల నేపథ్యంలో పాకిస్థాన్, టర్కీ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలో అవసరమైన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను వేగంగా మోహరించేందుకు చర్యలు చేపట్టాలని మూడు దేశాలు అంగీకరించాయి. న రియాద్‌లో జరిగిన మక్కా రక్షణ కూటమి వ్యూహాత్మక రాజకీయ, రక్షణ కమిటీ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సౌదీ అరేబియాపై జరుగుతున్న దాడులు, ఆ దేశ భద్రతకు ఎదురవుతున్న ముప్పులపై సమావేశంలో చర్చించారు. మక్కా, మదీనాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలతో పాటు సౌదీలోని నగరాలు, పౌర, ఆర్థిక మౌలిక వసతులపై జరుగుతున్న దాడులను మూడు దేశాలు తీవ్రంగా ఖండించాయి. సౌదీ అరేబియా భద్రత, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ఎలాంటి ముప్పునూ అంగీకరించబోమని స్పష్టం చేశాయి.
మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం ప్రకారం మూడు దేశాల ఉమ్మడి రక్షణ బాధ్యతలను అమలు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కమిటీ నిర్ణయించింది. అంగీకరించిన సైనిక బలగాలు, రక్షణ సామర్థ్యాలను సౌదీ అరేబియాలో వేగంగా మోహరించేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అయితే ఎంతమంది సైనికులను, ఎలాంటి ఆయుధ వ్యవస్థలను మోహరించనున్నారనే వివరాలను సంయుక్త ప్రకటన వెల్లడించలేదు.
ఈ ఒప్పందాన్ని సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ కుదుర్చుకున్నాయి. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే, దాన్ని మిగతా సభ్యులపై జరిగిన దాడిగా పరిగణించేలా ఒప్పందంలో నిబంధన ఉంది. తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ రక్షణ ఒప్పందం ఆచరణాత్మకంగా అమల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
యెమెన్‌లో హౌతీలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే మూడు దేశాల సంయుక్త ప్రకటనలో హౌతీలను ప్రత్యేకంగా ముప్పుగా పేర్కొనలేదు. పాకిస్థాన్, టర్కీ ఇప్పటికే సౌదీ రక్షణ వ్యవస్థకు సహాయక పాత్రలో ఉన్నాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.
అత్యవసర సమావేశంలో పాకిస్థాన్‌కు చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నౌమన్ మహ్మూద్ను మక్కా రక్షణ కూటమి తొలి సెక్రటరీ జనరల్‌గా మూడేళ్ల కాలానికి నియమించారు.




