చిన్నకోడూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 21
గ్రేడింగ్ పేరుతో సిద్దిపేట జిల్లాలో 70 కొనుగోలు కేంద్రాలు మూసివేయడం దారుణం.. ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం, సన్న వడ్ల బోనస్ పై జీవో విడుదల చేయాలని డిమాండ్. కల్లాల్లో ఉన్న వడ్లను వెంటనే కొనాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు పరిధిలోని మెట్టు బండల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు శనివారం సందర్శించారు. కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వడ్ల కొనుగోలు ప్రక్రియ జరగక రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో మౌలిక వసతులు లేవనే సాకుతో ఎల్ 2 గ్రేడ్ కేటాయించి 50 ఐకేపీ కేంద్రాలను, 20 ప్యాక్స్ సొసైటీలను కలిపి మొత్తం 70 కొనుగోలు కేంద్రాలను మూసివేశారని తెలిపారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట మండలాల్లోని కేంద్రాలు కూడా ఇందులో పోవడంతో 70 గ్రామాల్లో వడ్ల కొనుగోళ్లు ఆగిపోయి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం మొత్తం మీద ఇప్పటిదాకా ప్రభుత్వం కొన్న దొడ్డు వడ్లు కనీసం లక్ష మెట్రిక్ టన్నులు కూడా దాటలేదని, గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని తెలిపారు. కానీ ఈ సంవత్సరం లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనకుండా ప్రభుత్వం కావాలనే రైతులను గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇవాళ ఉదయం నుంచి ఎంతోమంది రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారని, ప్రభుత్వ కేంద్రాలు తెరవకపోవడంతో దొడ్డు వడ్లను ప్రైవేట్ వ్యాపారులకు క్వింటాల్ రూ. 2,100 కే అమ్ముకుంటున్నామని, అందులోనూ బస్తాకు 2 కిలోల తరుగు తీస్తున్నారని, వెంటనే డబ్బులు ఇవ్వాలంటే 1 శాతం కటింగ్ పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. చివరకు రైతు చేతికి రూ. 2,000 కూడా దక్కడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి కొనుగోలు చేస్తే రైతుకు క్వింటాల్‌కు రూ. 2,461 మద్దతు ధర రావాలని, కానీ ప్రభుత్వం కొనకపోవడం వల్ల క్వింటాల్‌కు రూ. 461 చొప్పున, ఎకరానికి రూ. 14 వేల నుంచి రూ. 15 వేల వరకు ప్రతి రైతు నష్టపోతున్నాడని, పెట్టుబడి, కష్టం అంతా వృథా అవుతోందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడూ వడ్ల కొనుగోళ్లకు ఇబ్బంది రాలేదని, కల్లాలకు రాగానే వెంటవెంటనే కొన్నామని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా గ్రేడింగ్ పద్ధతి అని పెట్టి 7080 సెంటర్లు మూసేశారని, ఉన్న సెంటర్లలోనూ వడ్లు కొనడం లేదని, ఇప్పటికీ మిల్లుల అలాట్మెంట్ జరగలేదని, గోదాముల ఏర్పాటు లేదని, కావాలనే ఆలస్యం చేస్తే రైతులు విసిగిపోయి బయట అమ్ముకుంటారని, తద్వారా ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వానికి డిమాండ్లు
ధాన్యం కొనుగోళ్లపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వానాకాలంలో ఈ సమయానికి ఎన్ని వడ్లు కొన్నారు, ఈ వానాకాలంలో ఇప్పటివరకు ఎన్ని వడ్లు కొన్నారో లెక్కలు బయటపెడితే ప్రజలకు అసలు నిజం తెలుస్తుందని అన్నారు. ప్రస్తుతం పెద్దకోడూరు కొనుగోలు కేంద్రంలోనే 63 మంది రైతులు వడ్లు తెచ్చి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని, కానీ ఇప్పటిదాకా కేవలం ఆరేడుగురు రైతుల వడ్లు మాత్రమే కాంటా వేశారని, మిగతా రైతులంతా ఇక్కడే ఉన్నారని, తేమ శాతం వచ్చిన వడ్లను కూడా వెంటనే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. మరోవైపు రేపో మాపో తుఫాన్ వస్తుందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోందని, ఈ వర్షాలకు కల్లాల్లో ఉన్న వడ్లన్నీ తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తుఫాన్ ముప్పు ఉన్నా కనీసం టార్పాలిన్ కవర్లు ఇవ్వడం లేదని, వచ్చిన వడ్లను వెంటనే కొనడం లేదని, మిల్లులతో టైఅప్ చేయడం లేదని, కల్లాలకు వచ్చిన వడ్లను వెంటనే తరలిస్తే రైతుల బాధ తప్పుతుందని అన్నారు.







