నర్మెట్ట, 14 November
వెల్దండ కొనుగోలు కేంద్రంలో నిలిచిపోయిన ధాన్యం కుప్పలు.. వెంటనే లారీలు కేటాయించాలని అధికారులకు విజ్ఞప్తి
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్, జీపీఎస్ విధానాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని వెల్దండ గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కంతి అంజనేయులు అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించి వెంటనే లారీలను కేటాయించాలని ఆయన అధికారులను కోరారు. శనివారం మండలం వెల్దండ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కంతి అంజనేయులు సందర్శించి, కొనుగోళ్లు జరగక నిలిచిపోయిన ధాన్యం కుప్పలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీపీఎస్, ఆన్లైన్ విధానాల కారణంగా ధాన్యం కాంటాలు నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కాంటాలు పూర్తయిన రెండు లారీలకు జీపీఎస్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తమ ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ కావడానికి రెండు నెలల సమయం పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన కంతి అంజనేయులు వెంటనే ఏపీఎంతో ఫోన్లో మాట్లాడి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ ప్రభుత్వం నిబంధనల పేరుతో జాప్యం చేయడం సరికాదన్నారు. జీపీఎస్, ఆన్లైన్ విధానాల వల్ల రోజుకు కనీసం ఒక లారీ కూడా రావడం లేదని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని తెలిపారు. వెంటనే వెల్దండ కొనుగోలు కేంద్రానికి ఐదు లారీలను కేటాయించి ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. కొనుగోళ్లలో ఇదే విధమైన జాప్యం కొనసాగితే రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుస్సి లతా కర్ణాకర్ రెడ్డి, వార్డు సభ్యులు ఓజాలు, ఉప్పలమ్మ, కృష్ణమూర్తి, రైతులు, హమాలీ సభ్యులు పాల్గొన్నారు.

