కొహెడ, 2026-11-24
ప్రముఖ కవి సుప్పని సత్యనారాయణ రచించిన శ్రీ సిద్ధప్ప వరకవి రాజయోగి శతపద కవితా స్తుతి పుస్తకావిష్కరణ గుండారెడ్డిపల్లిలోని సిద్ధప్ప ఆశ్రమంలోని వీరేశలింగం రాజయోగి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. సిద్ధప్ప కుమారుడు, ప్రముఖ కవి అనంతవరం మాణిక్య లింగం చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ప్రముఖ కవి సుప్పని సత్యనారాయణ రచించిన శ్రీ సిద్ధప్ప వరకవి రాజయోగి శతపద కవితా స్తుతి పుస్తకావిష్కరణ గుండారెడ్డిపల్లిలోని సిద్ధప్ప ఆశ్రమంలోని వీరేశలింగం రాజయోగి ప్రాంగణంలో ఘనంగా జరిగింది. సిద్ధప్ప కుమారుడు, ప్రముఖ కవి అనంతవరం మాణిక్య లింగం చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆత్మీయ అతిథిగా అనంతవరం గంగాధర్ మాట్లాడుతూ, తాతగారి సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందజేసే విధంగా పుస్తకాన్ని రాసిన రచయితను అభినందించారు. పుస్తకావిష్కర్త మాణిక్య లింగం మాట్లాడుతూ, ఈ పుస్తకం పరిశోధకులకు కరదీపికగా ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామ సర్పంచ్ పిల్లి బాబు మాట్లాడుతూ, సిద్ధప్ప లాంటి గొప్ప కవి మా గ్రామానికి చెందిన వాడు కావడం గర్వకారణమని అన్నారు. ఆశ్రమం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పుస్తక రచయిత సుప్పని సత్యనారాయణ మాట్లాడుతూ, సిద్ధప్ప లాంటి మహనీయుని జీవిత సాహిత్య విషయాలపై శతకం రాయడం అదృష్టంగా భావిస్తున్నానని, పుస్తకావిష్కరణ వారి సన్నిధిలో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథి, సిద్దిపేట శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు తరిగొప్పుల రామచంద్రం మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లో సిద్ధప్ప వరకవి విగ్రహాలను నెలకొల్పడానికి ప్రభుత్వాన్ని కోరతామని అన్నారు. కార్యక్రమంలో వరకవి కుటుంబ సభ్యులు, మాజీ సర్పంచ్ సుతారి కనకరాజు, మాజీ ఉపసర్పంచ్ సంజీవరెడ్డి, బాల సాహితీవేత్త పెందోట వెంకటేశ్వర్లు, కవి నార్లపురం రాములు, ఉపాధ్యాయులు తొగిటి సత్యనారాయణ పాల్గొన్నారు.







