కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 20
సిద్దిపేట జిల్లాలో రిలయన్స్ ఫౌండేషన్ దత్తత తీసుకున్న 454 గ్రామాల్లో కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని తొలి సందర్శనకు ఎంపిక చేయడం గ్రామానికి ఎంతో గర్వకారణమని గ్రామ సర్పంచ్ బూర్గు మధు మోహన్ అన్నారు.
మేదినీపూర్ గ్రామ సర్పంచ్ బూర్గు మధు మోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ సిబ్బంది, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, విద్యాభివృద్ధి, గ్రామీణ మహిళలు, పిల్లల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఫౌండేషన్ ప్రతినిధులకు వివరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బూర్గు మధు మోహన్ మాట్లాడుతూ, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు మేదినీపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రత్యేకంగా సందర్శించి అక్కడి కార్యక్రమాలను పరిశీలించడం గ్రామానికి ఎంతో ఆనందకరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల సమగ్ర అభివృద్ధి, మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో మేదినీపూర్ గ్రామంతో పాటు దత్తత తీసుకున్న ఇతర గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మహిళలు, చిన్నారుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సీడీపీఓ రమాదేవి, సూపర్వైజర్ మాధవి, కోఆర్డినేటర్ నవత, సీఆర్పీ గౌతమి, అంగన్వాడీ టీచర్లు ఉమారాణి, బూర్గు పుష్పలత, ఆయాలు బాలవ్వ, విజయ సునీతలకు సర్పంచ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచర్లు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.







