వరంగల్, 2026-11-22
ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సహకార పరపతి సమాఖ్య సమావేశంలో వక్తల పిలుపు
పద్మశాలి సహకార పరపతి సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి సమాఖ్యగా బలోపేతం కావడం ద్వారానే పద్మశాలి సమాజం ఆర్థికంగా, సామాజికంగా మరింత పురోగతి సాధిస్తుందని పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ భవన్లో పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సహకార పరపతి సంఘాల సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సహకార పరపతి సంఘాలు కేవలం పొదుపు, రుణాల మంజూరుకే పరిమితం కాకుండా పరస్పర విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకలుగా నిలవాలని సూచించారు. కష్టపడే తత్వం, పొదుపు, క్రమశిక్షణ, ఆత్మగౌరవం వంటి పద్మశాలీల సహజ విలువలను ఈ సంఘాల ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సహకార పరపతి సంఘాల సమాఖ్య కన్వీనర్, గ్రేటర్ వరంగల్ పద్మశాలి జర్నలిస్టుల సహకార పరపతి సంఘం కోశాధికారి వేముల సదానందం నేత మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని పద్మశాలి సహకార సంఘాలు విడివిడిగా కాకుండా సమాఖ్యగా ఏర్పడితే ఆర్థిక శక్తి రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా పేద కుటుంబాలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అండగా నిలిచేలా సంఘాలు ఆలోచించాలని వేముల కోరారు.
పరపతి సంఘాల నిర్వహణలో పారదర్శకత, సభ్యుల పట్ల బాధ్యత, పరస్పర గౌరవం తప్పనిసరిగా ఉండాలని ఆయన సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, వ్యక్తిగతంగా ఎదగడంతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించడమే నిజమైన విజయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమాఖ్యకు ప్రతి సంఘం ప్రతినిధి సంపూర్ణ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పద్మశాలి సహకార సంఘాల సమాఖ్య అడ్-హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. గౌరవ సలహాదారులుగా తెలంగాణ వేజ్ బోర్డు మెంబర్ బాసాని చంద్రప్రకాష్, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కన్వీనర్‌గా వేముల సదానందం నేత, కో-కన్వీనర్లుగా కొండబత్తుల రాజమౌళి, గుండు కామేశ్వర్, సభ్యులుగా యెలగం నర్సయ్య, పాశికంటి చంద్రశేఖర్, వన్నాల సాగర్, రాచర్ల అశోక్‌లను నియమించారు. ఈ సమావేశంలో వంగ అమరేందర్, మార్కండేయ, గజ్జెల్లి రవీందర్, గుత్తికొండ రమేష్, సిహెచ్. లింగమూర్తి, ఎస్. శేఖర్, గోరంటాల అశోక్, గుర్రపు రాజమౌళి, ఉమ్మడి జిల్లాలోని వివిధ పద్మశాలి సహకార పరపతి సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, పాలకవర్గ సభ్యులు, కులపెద్దలు, సమాజ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.







