పాలకుర్తి, 2026-11-21
అభిమాన్ గాంధీ నాయక్
పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం గుడికుంట తండా గ్రామ సర్పంచ్ మహేందర్ నాయక్ పై జరిగిన దాడిని నిరసిస్తూ, గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన గిరిజన ఉద్యమకారులను కొడకండ్ల పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్ తీవ్రంగా ఖండించారు.
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా మంజూరైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంపీడీవో ఆహ్వానం మేరకు సర్పంచ్ మహేందర్ నాయక్ హాజరయ్యారని తెలిపారు. అయితే తమ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేయకపోవడంతో, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని కలిసి తమ గ్రామ లబ్ధిదారులకు కూడా పత్రాలు అందించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే సమక్షంలోనే గిరిజన సర్పంచ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై గళమెత్తడం తప్పా
ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం తప్పా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడగడం తప్పా అని అభిమాన్ గాంధీ నాయక్ ప్రశ్నించారు. గిరిజనుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
శాంతియుత నిరసనకు సిద్ధమైతే అరెస్టులు
ఈ ఘటనను నిరసిస్తూ శనివారం పాలకుర్తిలో గాంధేయ మార్గంలో శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నామని, అయితే కొడకండ్ల పోలీసులు తమను, ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్ (టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు), భూక్య శ్రీను నాయక్ (ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు), గుగులోతు వీరేష్ నాయక్ (జి.బి. తండా గ్రామపంచాయతీ సర్పంచ్), ఎల్.హెచ్.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడిని అరెస్టు చేశారని తెలిపారు. ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టు చేయడం దురదృష్టకరమని అభిమాన్ గాంధీ నాయక్ పేర్కొన్నారు.
పోలీసుల ద్వారా తమ గొంతును నొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అధికార అహంకారానికి ఓట్ల రూపంలో తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.







