బచ్చన్నపేట్, 2026-11-22
ఐలమ్మ ఆశయాల సాధనకు, పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఐలమ్మ యువజన రజక సేవా సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం
వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో ఐలమ్మ యువజన రజక సేవా సంఘం ముందడుగు వేసింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ, ఆమె పోరాట చరిత్రను సమాజానికి గుర్తుచేసేలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
ఐలమ్మ ఆశయాలు, సంఘం లక్ష్యాలు
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రజక సంఘం ఐక్యత, సామాజిక చైతన్యం, యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మదికుంట రాధక్క, ఉపసర్పంచ్ మేడబోయిన నవీన్, వార్డు సభ్యులు తడకాపల్లి శంకరవ్వ, తాడూర్ భాను, రజక సంఘం అధ్యక్షుడు అమరాజు సంపత్, ఉపాధ్యక్షుడు తాడూరి సుధాకర్, కార్యదర్శి తాడూరి విక్రమ్, కోశాధికారి తాడూరి కిరణ్, జాయింట్ సెక్రటరీ అమరాజు విజయ్, గౌరవ అధ్యక్షుడు అమరాజు ప్రభాకర్, మదికుంట గాలి రెడ్డి, రజక సంఘం పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







