కుకునూరుపల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 26
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు గడ్డం నరేష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. కుల, మత, ప్రాంత, భాషా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించడమే రాజ్యాంగ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగం బలమైన పునాది అని ఆయన అన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. యువత రాజ్యాంగ విలువలను తెలుసుకొని సమానత్వం, సోదరభావం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కుకునూరుపల్లి మండల ఇన్చార్జి గడ్డం కిషన్, వార్డు సభ్యులు గడ్డం నరేష్, మలికి స్వామి, అంబేద్కర్ యువజన సంఘం కుకునూరుపల్లి అధ్యక్షుడు చింతకింది భాస్కర్, సంఘం సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.







