జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం జీడికల్ గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరాచల రామచంద్రస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు-2026కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు శాలువాతో సత్కరించి, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని 30వ తేదీ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కల్యాణోత్సవం అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, చారిత్రక నేపథ్యం, విశిష్టత కలిగిన జీడికల్ శ్రీ రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరాలు, ప్రత్యేక రవాణా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ఉత్సవాల విజయవంతానికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండబోయిన మమత, మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ మనోహర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శివకుమార్, మండల ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







