జనగామ, 2026-11-21
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి, విశిష్ట అతిథిగా మున్సిపల్ మేనేజర్ పి. ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ బూడిద జ్యోతి గోపి గౌడ్ మాట్లాడుతూ... కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా అకాల మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురికాకుండా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అండగా నిలుస్తుందని తెలిపారు. వార్డులోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పథకం అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని పేర్కొన్నారు.
మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గోపి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడు గుంటుక దామోదర్ రెడ్డి, సీనియర్ నాయకులు మార్తల ప్రభాకర్, గొట్టం శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాంటూరి అంజాజి, బీజేపీ నాయకులు కే. బాలసుబ్రమణ్యం (శివ), గుండు శశిరేఖ, భోగ భాస్కర్, బత్తిని నరసింహులు, ఆలూరి రమేష్ తదితరులు, వార్డు అధికారులు నిఖిల్ రెడ్డి, తిప్పారపు యాకుబ్, ఆర్పీ దుంబాల రేవతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.







