జనగామ, 2026-11-22
రాష్ట్రవ్యాప్తంగా ఐక్యంగా తరలిరావాలని ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పిలుపు
ఉప సర్పంచులు, వార్డు సభ్యుల హక్కుల సాధన కోసం కరీంనగర్లో నిర్వహించనున్న హలో ఉప సర్పంచ్ వార్డు మెంబర్ చలో కరీంనగర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పిలుపునిచ్చారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సభకు సంబంధించిన పోస్టర్‌ను బొట్ల కార్తీక్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బొట్ల కార్తీక్ మాట్లాడుతూ.... రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తమ హక్కుల కోసం సంఘటితంగా ముందుకు కరీంనగర్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ మాట్లాడుతూ... జనగామ జిల్లా నుంచి అన్ని మండలాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు భారీ సంఖ్యలో సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి కళ్యాణ్ ముదిరాజ్, జనగామ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నర్మెట్ట మండల అధ్యక్షుడు మూల కిరణ్ గౌడ్, దేవరుప్పుల మండల అధ్యక్షుడు జోగు అనిల్, లింగాలగణపురం మండల ఇన్చార్జి న్యాయం సతీష్ రెడ్డి, రఘునాథపల్లి మండల కార్యదర్శి సరిత మల్లేష్ యాదవ్, జనగామ మండల ఉపాధ్యక్షులు కల్పన శేఖర్‌తో పాటు వివిధ గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.







