జనగామ, 19 November
50 ఏళ్లకు తగ్గించాలి వయోపరిమితి, అర్హులందరికీ చేయూత పెన్షన్ అందించాలి
చేనేత కార్మికులకు పెన్షన్ల విషయంలో ప్రభుత్వ తీరుతో తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా ఇన్చార్జి, సీనియర్ జర్నలిస్ట్ చింతకింది కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత వృత్తినే నమ్ముకొని జీవితాంతం మగ్గంపై శ్రమిస్తున్న కార్మికులకు, వారి వృత్తి సేవలను గుర్తించి, వయస్సుతో సంబంధం లేకుండా తగిన పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. మగ్గం మీద నిరంతరం శ్రమిస్తూ అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న చేనేత కార్మికులకు పెన్షన్ అందించే విషయంలో ప్రస్తుత నిబంధనలను సడలించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చేయూత పెన్షన్లలో భాగంగా 50 సంవత్సరాలు దాటిన చేనేత కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయోపరిమితిని 50 సంవత్సరాలకు తగ్గించి, అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి చేయూత పెన్షన్ అందించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని, పెన్షన్ విషయంలో న్యాయం జరిగే వరకు పద్మశాలి సంఘం కార్మికుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి కార్మికుడికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.







