సిద్దిపేట, తెలంగాణ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్లపై ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను విస్మరించడం వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ ఎల్సీ ఉపనేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సీఎం దృష్టి సారించాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి మొదటిసారి సిద్దిపేట పర్యటనకు వచ్చినప్పుడు రుణమాఫీ చేస్తానని, రెండోసారి వచ్చినప్పుడు రైతు భరోసా ఇస్తానని హామీ ఇచ్చి రైతాంగాన్ని మోసం చేశారని ఆయన గుర్తుచేశారు. దేవుడంటే విశ్వాసం, ప్రజలంటే గౌరవం లేని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు సిద్దిపేటకు ఏ మొఖం పెట్టుకొని వస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ నెల 19న రేవంత్‌రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునరుద్ధరించి నిధులు విడుదల చేయాలని కోరుతూ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దిపేటలో నిలిచిపోయిన వెయ్యి పడకల ఆస్పత్రి, శిల్పారామం, స్పోర్ట్స్ స్టేడియం, పోలీస్ స్టేషన్లు, రింగ్ రోడ్డు, సిద్దిపేట-చిన్నకోడూరు నాలుగు వరుసల రహదారి, రంగనాయకసాగర్ పర్యాటక ప్రాజెక్టు తదితర రూ.1,070 కోట్ల పనులను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. వీటిని పునరుద్ధరించిన తర్వాతే సీఎం పర్యటనకు వస్తే స్వాగతం పలుకుతామని ఆయన అన్నారు. యంగ్ ఇండియా స్కూల్, బ్రేక్‌ఫాస్ట్ పథకాల అమలులో సిద్ధిపేటపై వివక్ష చూపుతున్నారని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వలేదని, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. కాలువల భూసేకరణకు నిధులు విడుదల చేయకపోవడం, ఇర్కోడ్ ఎత్తిపోతల పథకం, తపాస్‌పల్లి నీటి పనులు నిలిపివేయడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, ఫీజు రీయింబర్స్మెంట్ హామీలను కూడా అమలు చేయాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. తుమ్మిడిహట్టి వద్ద తగినంత నీరు లేదని కేంద్ర జలవనరుల శాఖ, సీడబ్ల్యూఎన్ గతంలోనే తెలిపాయని, అందుకే నీటి లభ్యత ఉన్న మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చినట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు.







