నంగునూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 16
అసంపూర్తిగా నిలిచిపోయిన రింగ్ రోడ్డు పనులతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పాలమాకుల సర్పంచ్ పోతరబోయిన ఓజోల్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వేణు చక్రవర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రవాణా కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అసంపూర్తిగా నిలిచిపోయిన రింగ్ రోడ్డు పనులతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పాలమాకుల సర్పంచ్ పోతరబోయిన ఓజోల్, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ వేణు చక్రవర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు రవాణా కష్టాలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని పాలమాకుల గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ, రింగ్ రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో పాలమాకుల-ఓబులాపూర్ మధ్య రహదారి పూర్తిగా కంకరతో దర్శనమిస్తోందని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డుపై కంకర కారణంగా వాహనాలు అదుపుతప్పి జారి పడుతున్నాయని చెప్పారు. పలువురు ప్రమాదాలకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ పంటను తరలించే సమయంలో రహదారి దుస్థితి తీవ్ర సమస్యగా మారిందని అన్నారు. గుంతలు, కంకరతో నిండిన మార్గంలో ధాన్యం నింపిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ప్రయాణించడం కష్టతరం అయిందని వివరించారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో రైతులు సమయం, శ్రమ వృథా చేసుకోవాల్సి వస్తోందని, ప్రమాదాల భయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రజల భద్రత, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించాలని కోరారు. సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే సభ నిర్వహణకు ముందే రింగ్ రోడ్డు పనులను ప్రారంభించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అధికారులు రహదారి దుస్థితిపై నిర్లక్ష్యం వహించడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి సభకు ముందే పనులు ప్రారంభించకపోతే గ్రామస్తులు, రైతులు, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు మోక్షం కల్పించాలని వారు కోరారు.







