జనగామ, 13 November
స్థానికంగానే మెరుగైన వైద్య పరీక్షలు.. ప్రజలకు సమయం,ఖర్చు ఆదా అవుతుందని ఎమ్మెల్యే వెల్లడి
చేర్యాల పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల సదుపాయాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు స్థానికంగానే నాణ్యమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వైద్య పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నాణ్యమైన వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.






