కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 13
జాతీయ రహదారి నిర్మాణం కోసం చేపట్టిన అలైన్మెంట్ మార్పుతో నాగసముద్రాల గ్రామంలోని టీజీ మోడల్ స్కూల్ ఆటస్థలం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, పాఠశాల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆటస్థలాన్ని కాపాడి, రహదారి అలైన్‌మెంట్‌ను పాఠశాలకు దూరంగా మార్చాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు.
జాతీయ రహదారి నిర్మాణం కోసం చేపట్టిన అలైన్మెంట్ మార్పుతో నాగసముద్రాల గ్రామంలోని టీజీ మోడల్ స్కూల్ ఆటస్థలం కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, పాఠశాల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ఆటస్థలాన్ని కాపాడి, రహదారి అలైన్‌మెంట్‌ను పాఠశాలకు దూరంగా మార్చాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. రామాయంపేట నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి (-760 ) పనుల్లో భాగంగా నాగసముద్రాల గ్రామం వద్ద గతంలో ప్రకటించిన అలైన్‌మెంట్‌కు భిన్నంగా కొత్త అలైన్మెంట్ రూపొందించారని, అది గ్రామంలోని టీజీ మోడల్ స్కూల్ ఆటస్థలం మధ్య నుంచి వెళ్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రతిపాదిత అలైన్మెంట్ ప్రకారం రహదారి నిర్మాణం చేపడితే పాఠశాలకు ఉన్న ఆటస్థలం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఆటలు, క్రీడా పోటీలకు అవసరమైన మైదానం లేకుండా పోవడమే కాకుండా పాఠశాల భవిష్యత్తుపై కూడా ప్రభావం పడుతుందని వివరించారు.
మండలంలోని సుమారు 20 గ్రామాలకు చెందిన దాదాపు 600 మంది విద్యార్థులు ఈ మోడల్ స్కూల్లో విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రహదారి అలైన్‌మెంట్‌ను పాఠశాల, ఆటస్థలానికి దూరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుల వినతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించి, అలైన్మెంట్ మార్పునకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, మాజీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, ప్రముఖ న్యాయవాది యాల్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు చింతలపల్లి భాస్కర్ రెడ్డి, తూముల ఆంజనేయులు, తుంగ సత్తయ్య, మంగళారపు లక్ష్మణ్, సుదగొని మధు, పారునంది కరుణాకర్ సాయి, పస్తం రాజు తదితరులు పాల్గొన్నారు.






