చిల్పూర్, 12 November
అకాల మరణం చెందిన సభ్యుల కుటుంబాలకు రూ.1.60 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ
దేశంలో ఏ సంఘం అందించని కుటుంబ భరోసా పథకం ఫోటోగ్రాఫర్ కుటుంబాలకు కొంత అండగా నిలుస్తుందని తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సంక్షేమ సంఘం రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి అన్నారు. జనగామ జిల్లాలో అకాల మరణం చెందిన తాళ్ళపల్లి గణేష్, ముత్యాల సురేష్ కుటుంబ సభ్యులకు కుటుంబ భరోసా పథకం కింద ఒక్కొక్కరికి రూ.1,60,000 చొప్పున చెక్కులను అందించారు. చిల్పూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల అధ్యక్షుడు అధ్యక్షత వహించగా, రాష్ట్ర, జిల్లా నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు మాధవరెడ్డి మాట్లాడుతూ, కుటుంబ భరోసా పథకంలో ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ సభ్యులుగా చేరాలని సూచించారు. రాష్ట్రంలో అనేక ఫోటోగ్రాఫర్ సంఘాలు ఉన్నప్పటికీ, తోటి ఫోటోగ్రాఫర్లకు కేవలం పది రూపాయల సహాయం అందించి, అకాల మరణం చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర సంఘానికి ఫోటోగ్రాఫర్లు అందించిన ప్రతి రూపాయిని సంఘం యొక్క కుటుంబ భరోసా పథకానికి వినియోగించడం జరుగుతుందని తెలిపారు. కొందరు మన సంఘంపై అసత్య ఆరోపణలు చేస్తూ, ఇబ్బందులకు గురిచేస్తూ కుటుంబ భరోసా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతరం రాష్ట్ర మీడియా ఇంచార్జ్ శేఖర్ మాట్లాడుతూ, కేవలం పది రూపాయలతో ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే గొప్ప ఆలోచనకు రూపశిల్పి అయిన రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సంఘం కోసం పనిచేస్తున్న వ్యక్తిపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారు ఇలాంటి కార్యక్రమాలు చూసైనా తమ మనసు మార్చుకోవాలని అన్నారు. రాష్ట్ర సంఘం వద్ద ప్రతి రూపాయికి లెక్కలు ఉన్నాయని, వాటిని ఏ సభ్యుడు కోరినా చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వలబోజు శ్రీనివాస మాట్లాడుతూ, కుటుంబ భరోసా కన్వీనర్లకు ప్రతి ఫోటోగ్రాఫర్ సహకరించాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు కాముని రాము మాట్లాడుతూ, కుటుంబ భరోసా పథకాలకు జిల్లాలోని ప్రతి ఫోటోగ్రాఫర్ సకాలంలో డబ్బులు చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొంపల్లి భాస్కర్ మాట్లాడుతూ, పది రూపాయలతో పాటు రూ.100 పథకంలో ప్రతి సభ్యుడు తమ వంతు డబ్బులు చెల్లించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.100 పథకంతో రాష్ట్రంలోని ప్రతి ఫోటోగ్రాఫర్కు ఐదు నుంచి పది లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే గొప్ప ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలతో పోటీపడుతూ మన కుటుంబ భరోసా పథకం పనిచేస్తుందని అన్నారు. అంతకుముందు ఫోటోగ్రఫీ సృష్టికర్త లూయిస్ దాగుర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతి చెందిన ఫోటోగ్రాఫర్ల కుటుంబ సభ్యులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లాల సతీష్, జిల్లా కోశాధికారి గొడుగుల కృష్ణ, కుటుంబ భరోసా ఉమ్మడి జిల్లా కన్వీనర్ సూరిబాబు, క్రమశిక్షణ కమిటీ జిల్లా చైర్మన్ గోరంతల దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కర్ణగంటి నాగరాజు, సుంకరి యాదగిరి, సహాయ కార్యదర్శి సోమరాజు రవి, జిల్లా కార్యదర్శి రంగు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి తౌటి గణేష్, మండల కోశాధికారి పురమాని శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.






