అగాపేట, అగాపేట, జనగామ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
జనగామ జిల్లా అగాపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంట నష్టం, అప్పుల బాధలు తాళలేక మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. 30 ఏళ్ల క్రితమే భర్త మరణించడంతో ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
పంట నష్టం, అప్పుల బాధలు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జనగామ జిల్లా అగాపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) భర్త 30 ఏళ్ల క్రితమే మరణించడంతో అప్పటి నుంచి ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
వివరాల్లోకి వెళితే
ఈ ఏడాది తనకున్న వ్యవసాయ భూమిలో పంట నష్టం జరగడంతో పాటు అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పలమ్మ ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు సేవించింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
ఈ ఘటనపై కుమారుడు మెట్ల నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంటరిగా జీవనం సాగిస్తూ వ్యవసాయంపై ఆధారపడిన ఉప్పలమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.






