మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా, నంగునూరులో హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీపై నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ శిక్షణను నిర్వహిస్తున్నాయి.
ఈ శిక్షణ ద్వారా మహిళలు నూతన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఎదగడంతో పాటు కుటుంబానికి అదనపు ఆదాయ వనరుగా నిలవాలని అదనపు డీఅర్డీవో సుధీర్ ఆకాంక్షించారు. నేర్చుకున్న నైపుణ్యాలను భవిష్యత్తులో ఉపాధి, స్వయం ఉపాధి కోసం వినియోగించుకోవాలని సూచించారు. ప్రస్తుత కాలంలో నైపుణ్యాభివృద్ధి మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో కీలకమని ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ గేమూ నాయక్ అన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, తమతోటి మహిళలకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. ఈడీఐఐ సంస్థ అధికారి ఎడ్మండ్ భూపతి మాట్లాడుతూ, ఈ శిక్షణ మొత్తం 22 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. థియరీతో పాటు ప్రాక్టికల్ శిక్షణ అందించి, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ తయారీకి సంబంధించిన వివిధ అంశాల్లో పూర్తి స్థాయి నైపుణ్యాన్ని అందించనున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు, స్వయం ఉపాధి లేదా చిన్న వ్యాపారంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇటువంటి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నంగునూరు సర్పంచి బాల పోచయ్య అన్నారు. హ్యాండ్‌మేడ్ జ్యువెలరీకి మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని, నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని మహిళలు స్వయం ఉపాధి పొందాలని ఆయన సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి 25 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేశారు. 22 రోజుల శిక్షణలో జ్యువెలరీ తయారీ నైపుణ్యాలతో పాటు, స్వయం ఉపాధి, చిన్న వ్యాపార నిర్వహణపై కూడా అవగాహన కల్పించనున్నారు. మహిళలు తమ ఇంటి నుంచే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీధర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నితీష్ కుమార్, వీవో, వీవోఏ ప్రతినిధులు, శిక్షణకు ఎంపికైన మహిళా అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. నైపుణ్యం స్వయం ఉపాధికి బాట, మహిళా సాధికారతకు పునాది అనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.












