*అక్కన్నపేట (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 16
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.64 లక్షల కొత్త పింఛన్లు మంజూరు కాగా, అక్కన్నపేటలో అదనంగా 567 పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో రామ్మూరి, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రభుత్వం 7 రకాల పింఛన్ల కింద 4.64 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసిందని తెలిపారు. అక్కన్నపేట మండలంలో ఇప్పటికే 5,818 పింఛన్లు ఉండగా, అదనంగా మరో 567 కొత్త పింఛన్లు మంజూరు చేశామని చెప్పారు. ఎల్కతుర్తి మండలంలో 715 కొత్త పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఇంకా పింఛన్లు అందని ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వృద్ధుల నుంచి త్వరలో దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
అక్కన్నపేట మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తామని, ఇందుకోసం , కార్యాలయాలు లేదా పోలీస్ స్టేషన్ సమీపంలో అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.79 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ప్రతి పేద కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఇళ్లు లేని పేదలు, తక్కువ భూమి ఉన్నవారు, ఆడపిల్లల తల్లులకు ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని, కార్తీక మాసంలోపే హుస్నాబాద్ నియోజకవర్గంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని వెల్లడించారు.
హుస్నాబాద్‌లో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమానికి మహిళలందరూ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.







