తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో డాక్టర్ రఘులత ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, 52 మందికి బీపీ పరీక్షలు చేశారు. బీపీ సమస్యలు ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు అవగాహన కల్పించారు. బీపీ ఉన్న వారు వైద్యుల సూచనల మేరకు మందులు క్రమం తప్పకుండా వినియోగించాలని, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడంతోపాటు రోజువారీ జీవనశైలిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డాక్టర్ రఘులత సూచించారు. ఆరోగ్యంలో ఏవైనా మార్పులు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ రఘులత కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.












