కోహెడ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి రాసూరి యుగేందర్ విమర్శించారు. తక్షణమే పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ చేపట్టిన మన బడి మన హక్కు కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని గుండారెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉదయం అందించే అల్పాహారం నాణ్యత తగ్గిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో సరఫరా చేస్తున్న బియ్యంలో నూకలు అధికంగా ఉంటున్నాయని తెలిపారు. నాణ్యమైన బియ్యం సరఫరా కాకపోయినా, వంట సిబ్బంది నూకలను వేరు చేసి విద్యార్థులకు మెరుగైన భోజనం అందించేందుకు చేస్తున్న కృషిని ఏఐఎస్ఎఫ్ నాయకులు అభినందించారు. అనంతరం పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడగా, గత 15 నెలలుగా వేతనాలు అందక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై యుగేందర్ స్పందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో విద్యనభ్యసించే హక్కు లేదా అని ప్రశ్నించారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచే కార్మికులకు 15 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలంటే కేవలం భవనాలు నిర్మించడం, ప్రచారాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సకాలంలో వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్లో ఉన్న 15 నెలల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఉదయం అల్పాహారం నాణ్యతను మెరుగుపరచాలని, మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్రను ఏఐఎస్ఎఫ్ నాయకులు అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులని, వాటి పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత అని వారు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యా హక్కుల కోసం, కార్మికుల న్యాయమైన వేతనాల కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని రాసూరి యుగేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కందుకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.






