వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి (-165)పై రఘునాథపల్లి మండల కేంద్రంలో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ, దానికి అనుబంధంగా చేపట్టిన సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొర్ర రాజేందర్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని 20 సెంటర్ల సమీపంలో ఒకవైపు, మీ-సేవ కేంద్రం సమీపంలో మరోవైపు సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తికాకపోవడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణించే వాహనాలు ఈ ప్రాంతాల్లో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ సమస్య రఘునాథపల్లి మండల ప్రజలకే పరిమితం కాదని, ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగుల భద్రతకు సంబంధించిన కీలక ప్రజా సమస్య అని అన్నారు. అసంపూర్తి పనుల కారణంగా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని తెలిపారు.
అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ, సర్వీస్ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని, రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని కొర్ర రాజేందర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.







