చేతబడి మూఢనమ్మకంతో వృద్ధుడిని హత్య చేసిన కేసును జిల్లా బచ్చన్నపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
ఏసీపీ భీమ్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, కొడవటూరు గ్రామానికి చెందిన మిన్నెలాపురం సిద్ధయ్య (60) అనే వృద్ధుడు గత నెల 23వ తేదీ తెల్లవారుజామున తన వ్యవసాయ క్షేత్రంలో తీవ్ర గాయాలతో మృతి చెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
విచారణలో వెల్లడైన నిజాలు
సుమారు 30 మందిని విచారించడంతో పాటు, 200కు పైగా సెల్ఫోన్ నంబర్ల కాల్ డేటాను, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. మృతుడి మేనత్త కుమారుడైన మిన్నెలాపురం శ్రీనివాస్, తన కుటుంబంలో నెలకొన్న అనారోగ్యాలు, మరణాలకు సిద్ధయ్య చేతబడి చేయడమే కారణమన్న మూఢనమ్మకంతో ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గతంలో కూడా సిద్ధయ్యపై హత్యాయత్నం చేసిన నిందితుడు, ఈసారి అతనిపై వెనుక నుంచి కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
పోలీసుల అభినందన
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ బీమ్ శర్మ, సీఐ దేవేందర్, బచ్చన్నపేట ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు. ప్రజలు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి, శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అనారోగ్యాలకు వైద్యులను సంప్రదించాలని ఏసీపీ భీమ్ శర్మ విజ్ఞప్తి చేశారు.












