కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ కట్టా హైమావతి తెలిపారు. శుక్రవారం మండలంలోని కొండపోచమ్మసాగర్, గజ్వేల్‌లోని ముట్రాజ్‌పల్లి మల్లన్నసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీలను ఆమె పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ, పరిహారం, పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీలు, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి పెండింగ్ అంశాలపై అధికారులతో సమీక్షించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే అర్హులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కొండపోచమ్మసాగర్ ఆర్అండ్ఆర్ కాలనీలో చెరువు పూర్తి నీటిమట్టం హద్దులను గుర్తించి, వాటికి ఆనుకుని ప్లాట్లు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేటాయించని భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఆక్రమణలు, సాగు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, సిద్దిపేట ఆర్డీఓ సదానందం, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.












