తరిగొప్పుల, జూలై 2
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, తక్షణమే మంత్రి జూపల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ తరిగొప్పుల మాజీ మండల అధికార ప్రతినిధి చిలువేరు లింగం డిమాండ్ చేశారు. ఒకరోజు ఒకలా, మరుసటిరోజు మరోలా అప్పుల లెక్కలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురు ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ తరిగొప్పుల మాజీ మండల బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చిలువేరు లింగం డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు.
నిన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పు చేసిందని ప్రకటించిన మంత్రి, ఈరోజు అదే అప్పును రూ.7 లక్షల కోట్లుగా పేర్కొనడం ఆశ్చర్యకరమన్నారు. ఒక్కరోజులోనే రూ.లక్ష కోట్ల అప్పు ఎలా తగ్గిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా ఇష్టానుసారంగా లెక్కలు చెప్పడం మంత్రికి తగదన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు సవాల్ విసిరిన నేపథ్యంలో, మంత్రి జూపల్లి కృష్ణారావు తాను తెలంగాణ భవన్కు వచ్చి చర్చకు సిద్ధమని ప్రకటించారని గుర్తు చేశారు. అయితే నిర్ణయించిన రోజున చర్చకు హాజరు కాకుండా తోక ముడిచి వెళ్లిపోయారని ఆరోపించారు. చర్చకు రావడానికి సరైన ఆధారాలు, వాస్తవాలు లేకపోవడంతోనే వెనక్కి తగ్గారని విమర్శించారు.
ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయడం కంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని మాజీ అధికార ప్రతినిధి చిలువేరు లింగం సూచించారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని, చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.











