పొన్నూరు అర్బన్, 2026-11-26
సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలోని ఐదు అంతస్తులను సందర్శించి, నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో నిర్మిస్తున్న అనంతుల మదన్మోహన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కె. హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలోని ఐదు అంతస్తులను సందర్శించి, నిర్మాణ పనుల పురోగతి, గదులు, వివిధ విభాగాలకు సంబంధించిన వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ విమల థామస్, టీజీఎంఐడీసీ ఇంజనీర్లు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కలిసి కలెక్టర్ నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అత్యాధునిక ఉచిత వైద్య సేవలు అందించేందుకు నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొదటి రెండు అంతస్తులను అత్యవసర వైద్య సేవలు, అన్ని ముఖ్యమైన వైద్య విభాగాలకు అనుగుణంగా అవసరమైన సౌకర్యాలతో సిద్ధం చేయాలని టీజీఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా, ప్రతి అంతస్తులో ఇప్పటివరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు నిధుల అంచనాలను సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన గదులు, ఫర్నిచర్, వైద్య పరికరాలను ఎక్కువ మంది కార్మికులను నియమించి శుభ్రం చేయించాలని అధికారులకు సూచించారు.
అనంతరం, సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదనపు నిధుల అవసరాలకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, టీజీఎంఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







