22 నవంబర్ 26 ఓరుగల్లు న్యూస్ (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 22
హుస్నాబాద్‌లో జరిగిన మూడవ ప్రెసిడెంట్స్ కప్ ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియనుషిప్ పోటీల్లో అక్కెనపల్లి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
హుస్నాబాద్‌లో ఈరోజు నిర్వహించిన మూడవ ప్రెసిడెంట్స్ కప్ ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియనుషిప్ పోటీలలో అక్కెనపల్లి పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. కరాటే కాటా విభాగంలో పాఠశాలకు చెందిన ఎన్. నిత్య ప్రథమ బహుమతి సాధించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకోగా, మరో విద్యార్థిని నిక్షిత తృతీయ బహుమతి సాధించి బ్రోంజ్ మెడల్‌ను గెలుచుకుంది. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తరి పద్మ, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సెన్సాయ్ బి. రమేష్ తదితరులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలియజేశారు. కరాటే శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందిస్తుందని, కరాటే నేర్చుకోవడం వలన చదువులో కూడా ప్రతిభ చూపించవచ్చని వారు పేర్కొన్నారు. విద్యార్థినులకు కరాటే శిక్షణతో పాటు మార్గదర్శకత్వం అందించిన కరాటే టీచర్ భూక్య అనిత ఈ విజయానికి సహకరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మంద జానయ్య విజేతలైన నిత్య, నిక్షితలతో పాటు కరాటే టీచర్ భూక్య అనితను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహకారం ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కరాటే రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విజయంపై సీనియర్ అధ్యాపకులు డా. ఎస్. శ్రీనివాస్, సి.హెచ్. రజని, ఎ. శ్రీనివాస్, ప్రభాకర్, మహేందర్, రవీందర్, సంధ్య, ముంతాజ్, శ్రీనివాస్, షబానా తదితర ఉపాధ్యాయులు విజేతలకు అభినందనలు తెలియజేశారు. తోటి విద్యార్థులు కూడా తమ సహచరుల విజయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అక్కెనపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల విజయ పరంపరలో మరో రెండు పతకాలు చేరడం పాఠశాలకు గర్వకారణం.



