నంగునూరు (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 25
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడంతో పాటు, ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది.
పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడంతో పాటు, అనుకోని ఆపద సమయంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని టీపీసీసీ కార్యదర్శి, నంగునూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి పేర్కొన్నారు. బుధవారం మగ్దుంపూర్ గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి, గ్రామంలో ఐదు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు వేసి భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందన్నారు. గతంలో సొంత ఇల్లు లేక నిరుపేద కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అలాంటి కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేదవాడికి సొంత ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల నిర్మాణం మాత్రమే కాదని, అది ఆత్మగౌరవానికి, భద్రతకు ప్రతీక అని యాదగిరి అన్నారు. నిరుపేద కుటుంబాలు గౌరవప్రదంగా జీవించేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తూ, నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని, మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హులైన పేదలకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు గొప్ప భరోసా కల్పించనుందని యాదగిరి తెలిపారు. కుటుంబ పెద్దకు అనుకోని ఆపద సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడకుండా ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
బీమా నమోదు ప్రక్రియలో అర్హులైన కుటుంబాలు తమ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. బీమా పొందే వ్యక్తి వివరాలు, ఆధార్, రేషన్ కార్డు, నామినీ వివరాలను జాగ్రత్తగా అందించాలని కోరారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిని బీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించవచ్చని తెలిపారు. దరఖాస్తుల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంగునూరు మండల కేంద్రంతో పాటు రాంపూర్, బద్దిపడగ, సిద్ధన్నపేట, నాగరాజుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని యాదగిరి తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు ఒక కుటుంబానికి శాశ్వత నివాస భద్రత కల్పిస్తే, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఆ కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థిక రక్షణ కల్పిస్తుందని యాదగిరి అన్నారు. ఈ రెండు పథకాలు ప్రజల జీవితాల్లో భద్రత, భరోసా నింపే కార్యక్రమాలని అభివర్ణించారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమ పాలనకు నాంది పలుకుతోందన్నారు. పేదలు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను పక్కనపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తూ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దేవులపల్లి యాదగిరి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాకాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ లాస్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అచ్చిన సత్తయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి గౌతమ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎనగందుల యాదగిరి, శేరి సురేందర్ రెడ్డి, పాలేపు నర్సింలు గౌడ్, వార్డు సభ్యులు జెల్ల పోచయ్య, రాజు, రాకేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భూమయ్య, బట్ట పర్శరాములు, రవి, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.







