తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా హోంగార్డుగా పనిచేస్తున్న మహబూబ్ బీ (43)ను ఆమె భర్త సతీష్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు క్వార్టర్స్‌లోనే ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత భార్యాభర్తల మధ్య కుటుంబ విషయాలపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సతీష్, మహబూబ్ బీపై దాడి చేసి, తలను గోడకు కొట్టి, గొంతు నులిమినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మరణించారు.
మహబూబ్ బీ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త సతీష్ గతంలో హోంగార్డుగా పనిచేసి, అనంతరం కానిస్టేబుల్‌గా ఎంపికైనప్పటికీ కొంతకాలానికే ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లు సమాచారం. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళ తన ఇంట్లోనే హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

