సోషల్ మీడియా వేదికగా నకిలీ కరెన్సీ తయారీ విధానం నేర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో రూ.2.54 లక్షల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నారని పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఈకోటెక్-1 పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గోల్చక్కర్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా స్కార్పియో వాహనంలో వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని బంటీ అట్రీ, ఖుష్దిల్, ఉపేంద్ర కుమార్‌గా గుర్తించారు. ముగ్గురూ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ.100 విలువైన 2,549 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం ముఖ విలువ రూ.2,54,900గా పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న నోట్లలో ఒకే సీరియల్ నంబర్ పునరావృతమై ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇవి ప్రింటర్ ద్వారా పెద్ద మొత్తంలో తయారు చేసిన నకిలీ నోట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుల వద్ద నుంచి నకిలీ నోట్లు ముద్రించేందుకు ఉపయోగించిన ప్రింటర్, నోట్లు కత్తిరించే యంత్రం, స్కార్పియో వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు, గుర్తింపు పత్రాలు, ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అసలు నోట్లను స్కాన్ చేసి వాటి మాదిరిగా నకిలీ నోట్లను ముద్రించేవారని విచారణలో వెల్లడైనట్లు అధికారులు పేర్కొన్నారు.
ఒక్కో రూ.100 నకిలీ నోటును తయారు చేయడానికి సుమారు రూ.10 నుంచి రూ.15 వరకు ఖర్చవుతుందని నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. నకిలీ నోట్ల కట్టలు అసలైనవిగా కనిపించేలా పైభాగంలో, కిందభాగంలో అసలు నోట్లను ఉంచి కట్టేవారని పోలీసులు తెలిపారు.
ఈ ముఠా కొంతకాలంగా నకిలీ నోట్లను మార్కెట్లో చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ తీసుకున్న వ్యవహారంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఠాతో ఇంకా ఎవరెవరు సంబంధం కలిగి ఉన్నారు, ఇప్పటివరకు ఎంత మొత్తంలో నకిలీ నోట్లను చలామణిలోకి పంపారు అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
నకిలీ కరెన్సీ తయారీ, నకిలీ నోట్లను అసలైనవిగా ఉపయోగించడం, వాటిని కలిగి ఉండటం వంటి ఆరోపణలపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.












