హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవం ఘనంగా కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వైపు తరలివస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, భారీ విగ్రహాన్ని తరలించే వాహనానికి సంబంధించిన హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సుమారు మూడు గంటల ఆలస్యం జరిగింది. మరమ్మతులు పూర్తయ్యాక ఉదయం 9.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది.
సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 20 వేల మంది పోలీసులను విధుల్లో నియమించినట్లు అధికారులు తెలిపారు.
జనసందోహాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు, మహిళా భద్రతా సిబ్బంది, నిఘా బృందాలను కూడా రంగంలోకి దించారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లు, రక్షణ బృందాలు, భారీ క్రేన్లు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.
నిమజ్జనోత్సవం నేపథ్యంలో నగరంలోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు పరిమితులు విధించారు. ప్రజలు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని పోలీసులు సూచించారు.
నగరంలోని పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న గణేశ్ విగ్రహాలతో హైదరాబాద్ అంతటా భక్తి వాతావరణం నెలకొంది.











