కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో హైజాక్ బెదిరింపు కలకలం సృష్టించింది. విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో బెదిరింపు నోట్‌ను గుర్తించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అధికారులు వెంటనే విమానాన్ని ఐసోలేషన్ ప్రాంతానికి తరలించి, ప్రయాణికులను కిందకు దించారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని భద్రతాపరమైన హెచ్చరిక నేపథ్యంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విమానం బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో, హైజాక్ చేస్తాం అని రాసి ఉన్న బెదిరింపు నోట్‌ను సిబ్బంది గుర్తించారు. ఈ విషయం తెలియగానే పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు, విమానాన్ని ప్రత్యేక ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. విమానంలో ఉన్న 105 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. భద్రతా సిబ్బంది విమానంతో పాటు ప్రయాణికుల లగేజీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో, హైజాక్ హెచ్చరిక బూటకమని అధికారులు నిర్ధారించారు. తనిఖీల అనంతరం, ఎటువంటి ఆటంకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత, విమానం సాయంత్రం 5.38 గంటలకు ముంబైకి బయలుదేరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని, అతని ఉద్దేశ్యాలను తెలుసుకునేందుకు విచారిస్తున్నారు.





