జనగామ, 2026-07-15
జనగామ మున్సిపాలిటీ పరిధిలోని ఒక నివాస భవనాన్ని వాణిజ్య అవసరాలకు, విద్యా సంస్థల నిర్వహణకు వినియోగిస్తూ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీ జరిగింది. ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ఆ భవనం వినియోగాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు, జనగామ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్, ఇంటి నెం. 6-2-2/47/B-3/1 (యజమాని: శ్రీ నిమ్మ రామ్మోహన్ రెడ్డి)లో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదం నేపథ్యంలో సంబంధిత భవనాన్ని బుధవారం జనగామ మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు.
ఈ పరిశీలనలో భవన నిర్మాణం, వినియోగంలో పలు నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. నివాస గృహ నిర్మాణానికి అనుమతి పొందిన భవనాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు, భవనంలో కెనరా బ్యాంక్ శాఖ, డీసీసీ బ్యాంక్‌తో పాటు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. అదే విధంగా స్టిల్ట్ ఫ్లోర్‌ను పార్కింగ్ నిబంధనలకు విరుద్ధంగా వినియోగించడం, తప్పనిసరిగా ఉండాల్సిన సెట్ బ్యాక్లను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయన్నారు.
భవన నిర్వహణలో నిబంధనలు పాటించకపోవడం వల్ల అగ్నిప్రమాదానికి దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత భవన వినియోగాన్ని తక్షణమే నిలిపివేస్తూ (Building Ceased) చర్యలు చేపట్టామన్నారు.
ఈ తనిఖీలో విద్యా శాఖ అదనపు డైరెక్టర్ కార్యాలయ ప్రతినిధులు, టిఎస్ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, జిల్లా ఫైర్ ఆఫీసర్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










