ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గురువారం నాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని న్యూశాయంపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత ఆచారాలను కించపరచరాదని, ప్రజాప్రతినిధులు భక్తుల మనోభావాలను దెబ్బతీయరాదని అన్నారు.
దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, న్యూశాయంపేటలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, హనుమాన్ మాలధారులు 41 రోజులు భక్తితో స్వామి వారిని కొలిచారని తెలిపారు. భక్తులు కొలిచిన హనుమాన్ విగ్రహాన్ని కూల్చివేయడం హనుమాన్ భక్తుల మనోభావాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. కూల్చిన చోటే హనుమాన్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
దేవాలయ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని కొందరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారని ఆరోపించారు. రాబోవు ప్రభుత్వంలో ఇదే స్థలంలో హనుమాన్ భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విందు రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ప్రజాప్రతినిధులు ప్రజల మనోభావాలను గౌరవించడం లేదని విమర్శించారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని మతాలు, కులాల విశ్వాసాలను గౌరవించామని, హనుమకొండ పట్టణంలోని ఏ ఒక్క చర్చి, మసీదు, దేవాలయం, బడి జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్న కొందరు గుడులను కూలగొడుతున్నారని, కొందరు హనుమాన్ విగ్రహాలను కూల్చుతున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చిన వారు దోపిడీకి, అవినీతికి పాల్పడుతున్నారని, ఆంజనేయ స్వామి వారి జోలికి వచ్చిన వారిని ఆ దేవుడే చూసుకుంటారని అన్నారు.






